అనంత పద్మనాభ స్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం











అద్బుతాల అనంత పద్మనాభుడు:6 వ గది నాగబంధన రహస్యాలు దాని వెనుక పురాణ కధనాలు:
కేరళ రాష్ట్రంలో ని ప్రసిద్ద అనంత పద్మనాభ స్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం.ఇటీవల ఆపార ధన రాశులు ఆలయ నేలమాళిగల్లో లభ్యం కావటంతో ప్రపంచవ్యాప్తం గా ఈ ఆలయానికి పేరు,ప్రఖ్యాతులు వచ్చాయి. అయ్యప్ప మాల వేసుకుని భక్తితో శబరి గిరీషుడు అయిన అయ్యప్ప స్వామి దగ్గరకు వెళ్లే వారు విధిగా ఈ దేవాలయం దర్శిస్తారు.అత్యంత రమణీయ గోపుర కట్టడం,మనోహర శిల్ప సంపద ఈ ఆలయ ప్రత్యేకత.
అనంత పద్యనాభుడి అనంత విశేషాలు !!!
కేరళ రాష్ట్రంలో రాజధాని నగరం తిరువనంతపురానికి మూడు-నాలుగు మైళ్ల దూరంలో "శ్రీ పద్మనాభ స్వామి దేవాలయం" వుంది. ప్రస్తుతం ఉన్న గోపురాన్ని మాత్రం 1566లోనే నిర్మించారు.
10008 సాల గ్రామాలతో రూపు దిద్దుకున్న ఈ ఆలయాన్ని ఆసాంతం చూడాలంటే వరుసగా మూడు ద్వారాలను దర్శించుకోవాల్సిందే. ఇక్కడ దీర్ఘ చతురస్రంగా వున్న వరండా నిర్మించడానికి 4000 మంది తాపీ పనివారు, 6 వేల మంది నిపుణులు, 100 ఏనుగులను ఉపయోగించి 7 నెలల్లో పూర్తిచేసారని అంటారు.
ట్రావంకోర్ రాజకుటుంబం చేరవాంశానికి చెందిన వారు అలాగే కులశేఖర సన్యాసి ఆళ్వార్ సంతతి వారు. ఈ ఆలయం శ్రీమహావిష్ణు యొక్క 108 దివ్యదేశములలో ఒకటి. 108 దివ్యాదేశములు అంటే శ్రీమహావిష్ణువు యొక్క ఆలయాలు ఉన్న దివ్యక్షేత్రాలు అని అర్ధం. శ్రీమత్భాగవతంలో బలరామదేవుడు తన తీర్ధయాత్రలో భాగంగా ఫాల్గుణం (ప్రస్తుత శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం ) అనే ఈ దేవాలయాన్ని దర్శించినట్లు, ఇక్కడ ఉన్న పంచప్సరసులో (పద్మతీర్థంలో) స్నానం చేసినట్లు అలాగే పది వేల ఆవులను బ్రాహ్మణులకు దానం చేసినట్లు తెలుస్తుంది. తమిళ ఆళ్వారులు రచించిన దివ్యప్రబంధంలో కూడా ఈ ఆలయం ప్రస్తుతించబడింది (6వ శతాబ్దం-9వ శతాబ్దం).
ఈ దేవాలయ ప్రాంగణం 7 ఎకరాల వరకూ వుంటుంది. ప్రత్యేకమైన టేకుతో బంగారు కవచంతో తయారు చేయబడిన ఈ దేవాలయం ధ్వజ స్తంభం ఎత్తు 80 అడుగులు.
1750 ప్రాంతంలో ట్రావన్ కోర్ను పరిపాలించిన మార్తాండ వర్మ అనంతపద్మనాభ స్వామికి రాజ్యాన్ని అంకితం చేశాడు. ఇక నుంచి రాజులు అనంతపద్మనాభుని సేవకులుగా మాత్రమే రాజ్యాన్ని పరిపాలిస్తారని మార్తాండ వర్మ ప్రకటించారు. అప్పటి నుంచి ట్రావన్ కోర్ రాజులకు అనంత పద్మనాభ దాస అనే బిరుదు కూడా వచ్చింది. నేటికి ఈ ఆలయం ట్రావెన్ కోర్ రాజ కుటుంబీకుల ఆధీనంలోనే ఉంది.
ఆలయం నుంచి లభించిన అపార సంపద ట్రావన్ కోర్ రాజవంశం వారసులకు చెందుతుందని పలువురు అంటున్నా, రాజ వంశానికి చెందిన వారు మాత్రం ఆ సంపద అంతా అనంత పద్మనాభుడికే చెందుతుందనడం వారి అపార భక్తికి నిదర్శనం.
ఈ దేవాలయంలో దైవ దర్శనమంటే, ఆదిశేషుడి మీద శయనించి ఉన్న అనంత పద్మనాభుడి 18 అడుగుల మూర్తిని మూడు ద్వారాల నుంచి-ముఖాన్ని దక్షిణ ద్వారం నుండి, పాదాలను ఉత్తర ద్వారం నుండి, నాభిని మధ్య ద్వారం నుండి దర్శించు కోవడమే. 10008 సాలగ్రామాలతో రూపు దిద్దుకొని, అమూల్యమైన వజ్రాలు పొదిగిన ఆభరణాలు ధరించిన స్వామి ధగధగా మెరిసిపోతూ దర్శనం ఇస్తారు. ఆదిశేషుడిపై యోగనిద్రలో వుండే విగ్రహం ఎదుట వుండే మండపం పై కప్పు ఒకే ఒక్క గ్రైనేట్ రాయితో మలచింది.
శ్రీ మహావిష్ణువు యోగనిద్రా మూర్తిగా దర్శనం ఇచ్చే అనంత పద్మనాభ స్వామి ఆలయం అపురూప శిల్పకళకు నిలయం. ఆలయం లోని స్తంభాలపై అనేక రకాల శిల్పాలు చెక్క బడి వుంటాయి. శ్రీ మహావిష్ణువు కొలువుండే 108 పవిత్ర క్షేత్రాల్లో అనంతపద్మనాభ క్షేత్రం ఒకటి. విష్ణుమూర్తి ఇక్కడ మూడు భంగిమల్లో... శయన భంగిమలో యోగ నిద్రా మూర్తిగా, నిలుచొని, కూర్చొని దర్శనం ఇస్తారు.
ఆలయంలోకి హిందువులను మాత్రమే అనుమతిస్తారు. పురుషులు పంచె, ఉత్తరీయం, స్త్రీలు చీరె ధరించి స్వామి దర్శనం చేసుకోవాలి. ఈ ఆలయంలో ఈ సంప్రదాయాన్ని విధిగా పాటిస్తారు.
"పద్మ నాభ" అంటే పద్మం ఆకారంలో ఉన్న నాభి కల వాడని అర్థం. యోగ నిద్రా మూర్తిగా శయనించి ఉండగా, నాభి నుంచి వచ్చిన కమలంలో బ్రహ్మ ఆసీనుడై వున్న అనంత పద్మనాభ స్వామి దివ్య మంగళ రూపం, నయనానందకరంగా కనిపిస్తుంది భక్తులకు. శేషుడు మీద శయనించిన శ్రీ మహావిష్ణువు చేతి కింద శివ లింగం కూడా ఉంటుంది. ఈ విధంగా, ఆలయం, త్రిమూర్తులకు నిలయంగా వెలిసిపోతుంటుంది.
గర్భగుడితో పాటు గాలి గోపురం మీద కూడా అందమైన శిల్పాలు దర్శనం ఇస్తాయి.ఆలయం ముందు పద్మ తీర్థం అనే కోనేరు ఉంటుంది. ఆలయం లోపల 80 ధ్వజస్తంభాలు ఉండడం ఇక్కడి విశేషం. ఆలయ ప్రాంగణంలో ఉన్న బలిపీఠం మండపం, ముఖమండపాల్లో కూడా దేవతామూర్తుల అపురూప శిల్పాలు కనిపిస్తాయి.
ప్రధాన ఆలయ మండపం ఒక మహాద్భుతం. 365 రాతి స్తంభాలతో ఈ మండపాన్ని నిర్మించారు. ఈ రాతి స్తంభాలతో పాటు మండపం పై కప్పు మీద కూడా దేవతామూర్తుల శిల్పాలను అందంగా చెక్కడం విశేషం.
బ్రహ్మ, వాయు, వరాహ, పద్మ-నాలుగు పురాణాలలో ఈ దేవాలయం ప్రస్తావన వుంది. దేవాలయంలో ఇప్పుడున్న వంద అడుగుల-ఏడంతస్తుల గోపురం పునాదులు 1566 లోనే పడ్డాయి. "పద్మ తీర్థం" అనే విశాలమైన చెరువు సరస్సును ఆనుకుని వుంటుంది దేవాలయం. 365 గ్రానైట్ రాతి స్తంభాలతో కూడిన విశాలమైన దేవాలయ ప్రాకారం, తూర్పు దిశగా విస్తరించి, గర్భ గుడిలోకి దారితీస్తుంది. ప్రాకారం నుండి లోనికెళ్లే ప్రధాన ద్వారం ముందర ఎనభై అడుగుల జండా స్తంభం వుంది.
అనంత శయనుడి విగ్రహాన్ని రూపొందించడానికి వాడిన సాల గ్రామాలను, నేపాల్ లోని గండకి నది ఒడ్డునుంచి తెప్పించారు. సాల గ్రామాలను ఏనుగులపై వూరేగించుకుంటూ అక్కడకు తెచ్చారట. ప్రతి సాల గ్రామం పైన ప్రత్యేకమైన ఆయుర్వేద మిశ్రమంతో తయారుచేసిన పదార్థాన్ని, అతకడానికి వీలయ్యే ప్లాస్టర్ లాగా ఉపయోగించారట. క్రిమి కీటకాల నుంచి విగ్రహం కాపాడబడ్డానికి అలా చేశారంటారు.
ఒక్క ట్రావన్ కోర్ రాజు మినహా ఎవరికీ సాష్టాంగపడి ప్రణామం చేసే అర్హత లేదక్కడ. ఆ రాజులు మాత్రమే "పద్మనాభ సేవకులు" గా పిలువ బడుతారు.
శ్రీ మహావిష్ణువు కొలువుండే 108 పవిత్ర క్షేత్రాల్లో, మూడు భంగిమల్లో ఏదో ఒక భంగిమలో మాత్రమే స్వామి దర్శనమివ్వడం జరుగుతుంది. ఈ దేవాలయంలో మాత్రం, శయన భంగిమలో యోగ నిద్రా మూర్తిగా, నిలుచొని, కూర్చొని స్వామి దర్శనం ఇస్తారు స్వామి.
పద్మనాభ స్వామి విగ్రహం, ముఖం, ఛాతీ మినహా, పూర్తిగా బంగారంతో చేయ బడింది. ముస్లిం రాజుల దండయాత్రలలో విగ్రహాలను ధ్వంసం కాకుండా కాపాడుకోవడానికి ఆయుర్వేద మిశ్రమాన్ని పూతగా వాడేవారు. స్వామి కిరీటం, చెవులకున్న కుండలాలు, ఛాతీని అలంకరించిన భారీ సాల గ్రామ మాల, మొత్తం ఛాతీ భాగం, శివుడి విగ్రహం వున్న చేతికున్న కంకణం, కమలం పట్టుకున్న ఎడమ చేయి, నాభి నుండి బ్రహ్మ వున్న కమలం వరకున్న తీగ, స్వామి పూర్తి పాదాలు కూడా బంగారు మయమే.
కోట్లాది రూపాయల విలువగల అపార సంపద ఆ దేవాలయం నేల మాళిగలలో నిక్షిప్తమై వుందని అత్యున్నత న్యాయస్థానం దృష్టికి పోవడంతో, న్యాయమూర్తుల ఆదేశానుసారం, ఆ నిధి నిక్షేపాలను వెలికితీయడంతో…
లభ్యమైన సంపద అంతులేనిది, అపారమైనది.
ఆ మందిరం భూగర్భంలో వెలువడిన.., వెలువడుతున్న వెలకట్టలేని నిధులకు, ఏకంగా అంతరిక్ష పహారాతో పటిష్ఠమైన భధ్రతను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గగన తలంలోని ఉపగ్రహ సేవలను ఇందుకోసం వినియోగించుకునేందుకు రంగం సిద్ధమవుతోంది.
సుమారు ఐదువేల సంవత్సరాల క్రితం అక్కడ కట్టబడిన, అత్యంత పురాతనమైన అనంత పద్మనాభుడి ఆలయం ఒకప్పుడు "ఎట్టువీట్టిల్ పిల్ల మార్" అనే ఎనిమిది కుటుంబాల వారి నిర్వహణలో వుండేది.
తర్వాతి కాలంలో ట్రావెన్ కోర్ సంస్థాపకుడైన కేరళ రాజు మార్తాండ వర్మ ఈ ఆలయాన్ని తన అధీనంలోకి తెచ్చుకుని, 1729 సంవత్సరంలో పునరుద్ధరించి, ఆలయానికి తామే సమస్తమంటూ ప్రకటించి, ఆలయంలోని శంఖాన్ని తమ సంస్థానానికి సంకేతంగా పెట్టుకున్నాడు.
తిరుమల ఆస్తులను మించి పోయిన తిరువనంతపురం పద్మనాభుడి సంపద ఎలా వచ్చిందన్న దాని పై ఎవరి వాదనలు వారే వినిపిస్తున్నారు. ఈ గదులకు వేసిన తాళాల తీరు, రాళ్లతో పకడ్బందీగా గదులను మూసి వేసిన వైనం, వాటిని తెరిపించిన కమిటీ సభ్యులను ఆశ్చర్య పరిచింది. ఒక్కో గది తాళాలు తీయడానికి చాలా సమయం పట్టినట్లు అధికారులు చెప్పారట.
అనంత పద్మనాభ స్వామి ఆలయ నేల మాళిగల్లోంచి బయటపడిన సొత్తు విలువ ఎంతనేది అప్రస్తుతం. ఆ సంపదంతా భగవంతుడు కే చెందాలి. దాని పరిరక్షణ ఉపయోగం, న్యాయ బద్ధంగా న్యాయ స్థానాల తీర్పు మేరకు నియమితులయ్యే, ట్రస్టీలే నిర్ణయించడం సమంజసం. ఇన్నాళ్లు, ఇంత పకడ్బందీగా, ఆ సొత్తును కాపాడుకుంటూ వస్తున్న, ని స్వార్థ ట్రావెన్ కోర్ రాజ వంశీయుల వారసులకే ఆ బాధ్యత అప్ప చెప్పడం హర్షణీయంగా వుంటుంది.
ఆ సంపదకున్న పురావస్తు ప్రాధాన్యతా దృష్టితో మాత్రమే దాన్ని చూస్తే, ఆ విలువ మరిన్ని రెట్లనడమే కాకుండా, బహుశా విలువ కట్టలేనిదని కూడా అనాల్సి వస్తుందేమో! అనేక చారిత్రక,ఆద్యాత్మిక అంశాలు ముడిపడి ఉన్న ఈ ఆలయ వీక్షణం గొప్ప అనుభూతి మిగుల్చుతుంది,భక్తి భావం మనలో పులకరింప చేస్తుంది,నమో అనంత పద్మనాభయా నమ: అంటూ మది నిండా భక్తి భావం ఉప్పొంగుతుంది.
ఇప్పటివరకు ఐదు నేలమాళిగలలోని సంపదను మాత్రమే లెక్కించారు. అందులోనె అనంతమై సంపద బయట పడింది. ఇంకా ఆరో గది తెరవ వలసి ఉంది. దాని నిర్మాణ రీత్యా అది చాల పెద్దది, అందులోనే ఇంకా ఎక్కువ సంపద దాచి వుంచ బడి వున్నదని తెలుస్తున్నది. ఇప్పటివరకే బయట పడిన సంపదతో దేశంలో అత్యంత సంపన్న క్షేత్రంగా ఈ ఆలయం రికార్డులకెక్కింది. ఇప్పటి వరకు బయల్పడిన సంపదలో బంగారం, వజ్రాబరణాలు, బంగారు దేవతా ప్రతిమలు, కిరీటాలు, పచ్చ రాళ్లు పొదిగిన నగలు. బస్తాలకొద్ది బంగారు వెండి నాణేలు, దాదాపు రెండు వేల రకాల కంఠాభరణాలు గొలుసులు బయల్పడ్డాయి. పదహారవ శతాబ్దం నాటి శ్రీ కృష్ణ దేవరాయల కాలంనాటి నాణేలు, ఈస్టిండియా కాలం నాటి నాణెలు, నెపోలియన్ బోనపార్టే కాలం నాటివి బస్తాల్లో లబ్య మయాయి. అంతే గాక చిత్ర విచిత్రమైన వస్తువులెన్నొ ఉన్నాయి. ఇంకా బంగారు కొబ్బరికాయలు, బంగారు శంఖాలు ఇలా ఎన్నో వింత వింత వస్తువులు వెలుగు చూసాయి. ఇంత సంపద బయల్పడినా ఇంకా అతి పెద్దది, అతి ముఖ్యమైనది అనంత పద్మనాభుడి ఆరో గది నాగబంధం రహస్యాలు:-
అంతులేని సంపదతో ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేవాలయంగా సంచలనం సృష్టిస్తోన్న కేరళలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఈ మధ్య బాగా వార్తల్లోకి వచ్చింది. అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని నేలమాళిగలలో ఎనలేని సంపద దొరుకుతున్న నేపథ్యంలో భారీగా భద్రత కల్పించారు. ఒకసారి చరిత్ర తదితర అంశాలలోకి వెళ్తే.. కేరళలోని తిరువనంతపురంలో గల అనంత పద్మనాభ స్వామి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. అద్భుతమైన శిల్ప సంపదకు, అచ్చెరువొందించే స్వామివారి జగన్మోహన రూపానికి సమ్మోహితులై, భక్తులు ఆలయ దర్శనానికి తండోప తండాలుగా వచ్చేవారు. అకస్మాత్తుగా అక్కడి నేలమాళిగల్లో బయట పడ్డ అనంత సంపదకు ప్రపంచమంతా ఔరా అని ఆశ్చర్యపోయింది.
బయటపడ్డ బంగారు ఆభరణాలు:
ఎన్నో రోజులు వార్తల్లో అదే ముఖ్యాంశమై నిలిచింది. ఆలయ నేలమాళిగల్లో బయటపడ్డ బంగారు ఆభరణాలు, వస్తువులు, పాత్రలు, 500 కిలోల బరువుండే ఏనుగులు, వింత వస్తువులు అందరినీ అబ్బురపరిచాయి. ఆలయ చివరి నేలమాళిగ ద్వారాన్ని మాత్రం తెరవడం ఎవరి వల్లా సాధ్యం కాలేదు. వాటిని తెరిచే ప్రయత్నం చేసిన అధికారులు మరణించడం, ఆ ద్వారం తెరవలేక పోవడం జరుగుతోంది. చివరికి సుప్రీం కోర్టు ఆ ద్వారం తెరవకూడదనే ఆదేశాలనిచ్చింది. ఇప్పటికీ ఆ ఆరవ నేలమాళిగ ద్వారం రహస్యాన్ని ఎవరూ ఛేదించలేక పోయారు. ఆరవ నేలమాళిగ ద్వారం ఉత్కృష్టమైన నాగపాశంతో సిద్ధ సాధువులు మంత్రోక్తంగా బంధించినట్లు తెలుస్తోంది.
నాగ బందం ఎలా వేశారు:-
ఆ ద్వారానికి ఎటువంటి చిలుకు కానీ మేకులు కానీ లేవు. అది 16వ శతాబ్దంలో మార్తాండవర్మ నిర్మింపజేసిన కట్టడం. ఎంతో మంది వేద పండితులు, తాంత్రికులు నాగ పాశాన్ని నిలువరించే గరుడ మంత్రాన్ని పఠించి ప్రయత్నించినా ఫలితం లేక పోయింది. మానవ మాత్రుల శక్తికందని ఏదో యోగ శక్తి ఆ సంపదను ఇప్పటికీ కాపాడుతోంది. అయితే సర్పబంధం(నాగబందం) గురించి మీకు తెలుసా..!? ఓసారి తెలుస్కోవాల్సిందే. వేదాలు, ఇతిహాసాల కాలం నుంచి నేటి వరకు మానవ జీవితాలతో సర్పాలకు విడదీయరాని బంధం ఉంది. కొన్ని సందర్భాల్లో నాగదేవతగా పూజలందుకుంటే, మరికొన్ని వేళల్లో ప్రాణాలు తీసే విషనాగుగా ప్రజల ఆగ్రహానికి కారణం అవుతుంది.
కశ్యపునికి ఇద్దరు భార్యలు:-
అందుకే అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నాగబంధం ఉన్న ఆరో నేలమాళిగను తెరిచేందుకు పండితులు అంగీకరించట్లేదనే విషయం తెలిసిందే. నాగజాతి విశేషాల సమాహారం పరిశీలిస్తే. 'అనల తేజులు దీర్ఘ దేహులు నైన యట్టి తనూజులన్ వినుత సత్త్వుల గోరె గద్రువ వేపురం వేడ్కతో…' కశ్యపునికి కద్రువ, వినత అనే ఇద్దరు భార్యలు. ఇది కృతయుంగంలోని విషయం. పుత్ర కామేష్ఠ యాగానంతరం వారి వారి కోరికల ప్రకారం కద్రువకు ఐదు వందల ఏళ్ల పాటు నేతి కుండలలో భధ్రపరచగా కద్రువ గుడ్ల నుంచి శేషుడు, వాసుకి, ఐరావతం, తక్షక, కర్కోటక, ధనంజయ, కాళియ ఇత్యాది నాగుల వెలువడ్డారు.
సర్పం-సప్త ప్రతీకలు:
1. దేవునిగా- తన తోకను తానే మింగుతుంది కాబట్టి. అంతేగాక అనేక తెగలలో సర్పం సృష్టిలో ప్రముఖ పాత్ర వహించిందని నమ్మేవారు.
2.తన తోకను తానే మింగుతూ వృత్తాకారంలో ఉన్న సర్పాన్ని అనంతానికి చిహ్నంగా ప్రాచీనులు భావించారు. నవీన శాస్త్రజ్ఞుడు ‘కెకూలే’ ఈ చిహ్నాన్ని కల గని ‘బెంజిన్’ అణు నిర్మాణాన్ని ఊహించాడని, అదే రసాయన శాస్త్రంలో మరో ముందడగు అయిందని చెబుతారు.
3. పునరుజ్జీవనానికి, పునర్ యవ్వనానికి, కుబుసాన్ని విడిచి తిరిగి శక్తిని పొందడం ద్వారా ఎస్కులేపియస్ దేవునికి ప్రీతిపాత్రమై, సర్పం వైద్య రంగానికి చిహ్నమైంది.
4. గ్రీకులకు, రోమన్లకు సంరక్షక దేవత. హోమగుండాల వద్ద చిహ్నంగా ఉంది. కౌరవుల యుద్ధ పతాకం సర్పం.
5.జ్ఞానానికి
6. సైతానుకు కూడా సర్పాలే గుర్తు. తొలి మానవుల పతనం ఈజిప్షియన్లకు, హిబ్రూలకు, కాననైట్లకు, మధ్యధరా ప్రాంతం వారికి, ఉగ్రాయిట్లు, సుమేరియన్లకు సర్పాలు సరప్(మంట పుట్టించేవి), నాహాస్, పెటెన్, బెటెన్, నాగులుగా సుపరిచితమే.
500 ఏళ్ళు తరువాత గరుడడు జన్మించాడు:
తల్లి తొందర పాటు వల్ల వినత అండాల నుంచి సగం దేహంతో అనూరుడు, ఆ తరువాత మరో ఐదు వందల ఏళ్లకు గరుడుడు జన్మించారని భారతంలోని అది పర్వం ద్వితియాశ్వాసంలో పేర్కొన్నారు. హారంగా, పడకగా… ఆది శేషుడు భూభారాన్ని వహించగా, వాసుకి పాల సముద్ర మధనంలో తరిత్రాడుగా ఉపయోగపడ్డాడు. తక్షకుని విషం, చోరత్వం, పరీక్షిత్తు మరణానికి, జనమేజయుడు నిర్వహించిన సర్ప యాగానికి హేతువులైనాయి. కాళీయ మర్దనం కృష్ణావతారంలో ముఖ్య ఘట్టం. శివుని కంఠంలో హారంగా, విష్ణువు పడకగా సర్పాలు వారికి అత్యంత సన్నిహితులైనాయి.
తండ్రి ఒక్కరే అయినా తల్లుల మధ్య గల వైషమ్యం, పిల్లల మధ్య విరోధానికి ఎలా దారి తీస్తుందో నాగులు, గరుత్మంతుడి వృత్తాంతం ద్వారా మనకు అవగతమవుతుంది. తన ఆజ్ఞను మీరినందుకు ఆదాం, ఈవ్లను దేవుడు ఈడెను తోట నుంచి బహిష్కరించి వారిని అందుకు పురికొల్పిన సాతాను సర్పాన్ని… నీవు నీ పొట్ట పై పాకుతూ, మట్టి తింటూ నీ జీవితం గడుపు. ఈ స్త్రీ, ఆమె కుమారులు నీకు శత్రువులగుదురు గాక! నీవు వారి కాలి పై కాటు వేస్తావు, వారు నీ తల పై గాయపరుస్తారు అని ఆజ్ఞాపించారు. సర్పం-సప్త ప్రతీకలు ప్రాచీన కాలం నుంచి సర్పం(సర్పెంట్) సప్త విషయాలకు ప్రతీకగా ఉంది.
మొత్తం 3000 రకాల షర్పాలు ఉన్నాయి:
గిల్గామేష్ కథలో నానా కష్టాలు పడి గిల్గామేష్ సాధించుకు వచ్చిన మృత సంజీవనీ లతను సర్పం అపహరించుకొని పోయి మానవులకు మృత్యువు తప్పని సరి చేస్తుంది. ఉదంకుని దగ్గరి కుండలాలపహరించుకొని పోయి తక్షకుడు సర్పయాగంలో తన వంశ వినాశనానికి కారణ భూతుడవుతాడు. జ్ఞాన ఫలాన్ని ఈవ్, ఆదాం తొలి మానవ దంపతులు తినేలా చేసి సాతాన్ సర్పం తొలి మానవుల పతనానికి కారణమయ్యాడు. ఈజిప్షియన్లకు నాగ దేవతలున్నారు. యురియస్ సర్పం రక్షణకు, ఎపెప్ కీడుకు, ఎనెప్ సంతానానికి దేవతలు. గ్రీకులకు డ్రాగన్ అంటే మహాసర్పం. ప్రాచీన గాథల్లో డ్రాగన్లు ఎక్కువ. నాగుల చవితి మనకు అత్యంత ప్రియమైన పండగ.
ఓహియో దేశంలో ప్రసిద్ధి కెక్కిన మహా సర్పపు దిబ్బ అమెరికన్ ఇండియన్లకు పవిత్రమైనది. దీని పొడవు అరకిలోమీటరు. మహారాజయోగంజూపిటర్ దేవత సర్ప రూపంలో ఒలింపియాకు ప్రత్యక్షమైనాడని అందుకే అతని ఆశీస్సులతో అలెగ్జాండర్ జనించాడని ఓ ఐతిహ్యం. మార్క్ ఏంటోని క్లియోపాత్రను ముద్దుగా ‘ద సర్పెంట్ ఆఫ్ ఓ ల్డ్ నైల్’ నైలు నదీ సర్పంగా పిలిచేవారట. క్లియో పాత్ర మరణించేప్పుడు ‘ఏస్ప్’ సర్పాలను పెదాలకు, హృదయం పై కాటు వేయించుకొని నిశ్శబ్దంగా నిష్క్రమించడం మనకు తెలుసు. మొదలైన పదం తిరిగి వాక్యం చివర వచ్చే కవిత్వ పంక్తులను సర్పెంటైన్ వర్సెస్ అంటారు.
సర్ప బంధ కవిత్వం మనకు తెలుసు. సర్పజాతులు ఆస్ట్రేలియన్ల ఆదిమ తెగలు ఇంద్ర ధనుస్సు సర్పం భూమికి పర్వతాలతో, నదులతో నిర్మించిందని నమ్ముతారు. సర్పం కలలోకి రావడం శృంగారానికి, కామేచ్ఛకి చిహ్నంగా ఫ్రాయిడ్ లాంటి మానసిక శాస్త్రజ్ఞులు చెప్పారు. సంవత్సరానికి లక్షమందిని మృతుల్ని చేసే విష జాతి సర్పాలు 600 ఉంటే, మొత్తం 3,000 రకాల పాముల ఉన్నాయని ఒక అంచనా అర్జునుడు నాగకన్య ఉలూచిని పెళ్లాడాడు. కంబోడియాలోని అంగ్కోర్ రాజ వంశీకులు తాము బ్రహ్మణ రాజకుమారుడు నాగుల యువరాణిల సంతానమని విశ్వసిస్తారు. హితుడిగాను, శత్రువుగాను సర్పం ప్రసిద్ధమే.
నాగబంధం అసలు రహస్యం:-
అందుకే భగవానుడిలా వాక్రుచ్చినాడు.”సర్పాణా మస్మి వాసుకిః అనంత శ్చాస్మి నాగానాం! కేరళలో ఇప్పటికీ తాంత్రిక విద్యలు తెలిసిన వారు కొంత మంది ఉన్నారు. వీరిలో కొందరి తాతలు, తండ్రులు రాజాస్థానంలో వివిధ ఉద్యోగాలు చేసినవారే. తమ తండ్రులకు, తాతలకు నాగబంధనం చేయడం ఎలాగో తెలుసని చాలా స్పష్టంగా చెబుతున్నారు. వారు చెబుతున్న అంశాలను క్రోడీకరిస్తే, కీలకమైన అంశాలు వెలుగు చూస్తున్నాయి. అవేంటంటే..
1. నాగబంధం అన్నది మొత్తం నిధినిక్షేపాలకు వర్తిస్తుంది.
2. కేవలం నాగబంధం వేసిన గదికి మాత్రమే నాగుల రక్ష ఉన్నదని అనుకోవడానికి వీల్లేదు.
3. నేలమాళిగలోని ఐదు గదులను తెరిచి అందులోని సంపదను గుర్తించినప్పుడే నాగబంధం తన ప్రభావం చూపడం మొదలు పెట్టింది.
4. సంపద వెలుగుచూస్తున్న సమయంలోనే కమిటీ సభ్యుల్లో ఒకరికి మాతృవియోగం సంభవించింది. మరొక సభ్యునికి కాలు విరిగింది.
5. ఐదు గదులను తెరిచిన తరువాత ఆరో గదిని కూడా తెరవాలనుకున్నారు. అయితే, ఆ గది తలుపుల పై నాగపాముల చిహ్నాలు కనిపించడంతో వెంటనే సాహసించలేకపోయారు.
6. ఈలోగా సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో మరో కమిటీ వేసి ఆస్తుల గుర్తింపు, భద్రపరిచే చర్యల పర్యవేక్షణ చేపట్టాల్సిందిగా సూచించింది. ఈ కమిటీ సూచన మేరకు ఆరోగది విషయం పై తుది నిర్ణయం తీసుకుంటారు.
7. మొదటి గది తెరిచినప్పటి నుంచే నాగబంధం తన ప్రభావాన్ని చూపుతున్నదని స్థానికులు చెబ్తున్నారు.
8. ఇందుకు పరాకాష్టగా నిధుల పై కోర్టులో కేసు వేసిన ఆజన్మ బ్రహ్మచారి అయిన సుందరరాజన్ కూడా కన్ను మూశారు.
9. ఆయన మరణం వెనుక కూడా నాగబంధం ప్రభావం ఉన్నదన్నది స్థానికుల్లో కొందరి ప్రగాఢ నమ్మకం.
10. ఆపార నిధినిక్షేపాలు ఐదు గదుల్లో ఉండగా, కేవలం ఆరో గదికే నాగబంధం వేశారని అనుకోవడం ఒట్టి భ్రమ అని తాంత్రిక విద్యలు తెలిసిన వ్యక్తి ఒకరు చెప్పారు.
11. నాగబంధం ఒకసారి వేస్తే, అది వేల సంవత్సరాలైనా పని చేస్తూనే ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే, సర్పజాతి ఉన్నంత వరకు ఈ బంధం పటిష్టంగానే ఉంటుంది.
12. ఐదు తలల పాము దగ్గర నుంచి అనేక విషపూరిత పాములను నాగబంధం వేసేటప్పుడు ఆవాహన చేస్తారు. ఆ క్షణం నుంచే అవి నిధినిక్షేపాలను కాపాడుతుంటాయి.
13. అనంత పద్మనాభస్వామి ఆలయంలో ఇలాంటి నాగబంధమే ఉన్నది. ఇది మొత్తం నిధినిక్షేపాలకు సంబంధించిన బంధమే కానీ, కేవలం ఆరోగదికి మాత్రమే పరిమితమైనది కాదు.
14. అందుకే, నిధినిక్షేపాలున్న గదులు తెరవగానే కీడు జరగడం మొదలైంది. అకాల మరణాలు, అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
15. మరి ఆరోగది తలుపులు తెరిస్తే ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందని కేరళలోని తాంత్రికుడ్ని ఫోన్ ద్వారా సంప్రదిస్తే దొరికిన సమాధానమిది.
16. ఆరోగది తలుపులు ఇప్పుడు తెరిచినా, తెరవకపోయినా జరగాల్సిన కీడు జరగడం మొదలైంది. కాకపోతే నాగబంధం ప్రభావం ఈ గదిలో మరింత ఎక్కువగా ఉండవచ్చు.
17. ఆరోగది తలుపులు తెరిస్తే, అనూహ్యమైన సంఘటనలు చోటుచేసుకోవచ్చు. మరిన్నిదారుణాలు జరగవచ్చు.
18. తాంత్రిక శాస్త్ర పరంగా కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేసి నాగబంధాన్ని విముక్తి చేయవచ్చా… అని అడిగినప్పుడు వచ్చిన సమాధానం ఇది…
19. ఆ పని ముందే చేయాల్సింది. అంటే, మొదటి గది తలుపులు తెరవడానికి ముందే తాంత్రిక శక్తులున్న వారిని పిలిపించి నాగబంధం నుంచి నిధినిక్షేపాలను విముక్తి చేసిన తరువాత గది తలుపులు తెరిస్తే బాగుండేది.
ఇంత సంపద ఎలా వచ్చింది?
పద్నాలుగు, పదిహేను శతాబ్ధాల కాలంలో యూరోపియన్ దేశాలు, మన దేశంతో సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేసేటప్పుడు, మలాబార్ తీరంలో ఉన్న ఈ ప్రాంతానికి అనంతంగా సంపద వచ్చి చేరిందని చెబుతారు. దానితో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన విజయనగరరాజులు, చేరరాజులు, పురప్రముఖులు, సాధారణ ప్రజలు. ఇబ్బిడి ముబ్బిడిగా పద్మనాభుడికి కానుకలు సమర్పించి ఉండవచ్చు. తరువాతి కాలంలో డచ్చి వారి నుంచి, బ్రిటిష్ వారి నుంచి, పొరుగు రాజయిన టిప్పు సుల్తాన్ నుంచి ఈ రాజ్యానికి ముప్పుపొంచి ఉండడంతో 18వ శతాబ్ధంలో ఈ గుడిని పునర్నిర్మించినప్పుడు సంపదనంతా నేలమాళిగలలో భద్రపరిచారు.
అదే ఇప్పుడు బయటపడిన బంగారు గని. మొత్తం మీద అనంత పద్మనాభ స్వామి ఆలయంలో దొరికిన అనంత సంపద పై ఎవరి వాదన వారు వినిపిస్తున్నా, ఏదో అద్వీతీయ శక్తి మాత్రం ఈ సంపదను కాపాడుతూ వస్తోందని చెప్పవచ్చు. అయిన ఆరో గది తెరవాల్సి ఉంది.
ఈ అధ్భుత విషయాలన్నింటిని మీరు కల్లారా చూడాలనుకుంటే అనంత పధ్మనాభుడి ధర్శనం చేయవలసిందే,అనంత పద్మనాభుని ఆశీస్సులు, మన అందరి పై ఉండాలని కోరుతున్నాను

Comments